అగ్రరాజ్యంలో కొవిడ్ కల్లోలం…
అమెరికాలో డెల్టా రకం కరోనాతో అక్కడ వైరస్ తీవ్రత మరోసారి పెరిగింది. రోజువారీ మరణాల సంఖ్య 1000 మార్కు దాటేసింది. సగటున గంటకు 42 మంది మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిత్యం సగటున 769 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒక్కరోజే ఈ సంఖ్య 1017కు చేరింది. ఇలా అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6 లక్షల 22 వేలకు దాటింది. కొంతకాలంగా అమెరికాలో వైరస్ తీవ్రత పెరగడంతో ఆస్పత్రి చేరికలు కూడా ఎక్కువయ్యాయి. గడిచిన రెండు వారాల్లోనే ఆస్పత్రి చేరికలు దాదాపు 70 శాతం పెరిగినట్లు అంచనా.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికాలో వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపించింది. దీంతో చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడంపైనా ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. కానీ గత నెల రోజులుగా అక్కడ కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య అనుహ్యంగా పెరిగాయి. కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరగడంతో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోనివారికి ప్రమాదం అంచున ఉన్నట్లేనన్న ఎన్ఐ హెచ్, కొవిడ్ పోరుపై కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది.







