ఏపీలో కరోనా విజృంభణ

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,37,049 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో నెల్లూరులో నలుగురు చనిపోగా, చిత్తూరు, కృష్ణాలో ముగ్గురేసి, విశాఖలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,606 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,01,327కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో వందకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.