జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పై అగ్రరాజ్యం తాత్కాలిక సస్పెన్షన్!
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం చాలా ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగి వ్యాక్సిన్ ల తయారీ యజ్ఞాన్ని భుజాలకెత్తుకున్నాయి. వాటిలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా ఒకటి. మిగతా కంపెనీల్లో కరోనా నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి పెడితే.. ఈ కంపెనీ మాత్రం సింగిల్ డోస్ వ్యాక్సిన్‌పై ఫోకస్ పెట్టింది. క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు పచ్చజెండా ఊపాయి కూడా. అయితే ఇలా చేసిన తర్వాత ఆయా దేశాలకు ఈ వ్యాక్సిన్ వల్ల తలనొప్పులు మొదలయ్యాయి. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వాక్సిన్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. వాక్సిన్ తీసుకున్న కొందరిలో ప్లేట్ లెట్స్ తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలను గుర్తించిన అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగంపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది. అయితే, ఇప్పటికే ఈ వ్యాక్సిన్ 6.8 మిలియన్ డోసులను అమెరికా వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చినట్లు సమాచారం. అమెరికాతోపాటు, సౌతాఫ్రికా, యూరోపియన్ యూనియన్ కూడా జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలుపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో యురోపియన్ దేశాల్లో కూడా వ్యాక్సిన్ వినియోగం సమయంలో వెలుగు చూసిన సమస్యలపై యూఎస్‌కు చెందిన సీడీసీ, ఎఫ్‌డీఏ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కారణంగా రక్తంగడ్డ కట్టే సమస్య ఎదురవడం, అమెరికా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న ఆరుగురిలో బ్లడ్ క్లాట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేశామని, ముందు జాగ్రత్త చర్యగానే ఇలా సిఫారసు చేసినట్లు అమెరికా డ్రగ్ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ట్వీట్ చేసింది. అలాగే, వ్యాక్సిన్ తీసుకుని అరుదైన.. తీవ్రమైన రక్తం గడ్డ కట్టిన సమస్యతో బాధపడుతున్న ఆరుగురి డేటాను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. అయితే ఈ సమస్యలు చాలా అరుదుగానే కనిపించాయని పేర్కొంది.







