కరోనాతో భారత్ కకావికలం!

దేశంలో కరోనా మహమ్మారి కుమ్మేస్తోంది. సెకండ్ వేవ్ ఊహించని స్థాయిలో పోటుత్తుతోంది. కొత్త కేసుల సంఖ్య 3 లక్షల 50 వేలను తాకింది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 3 లక్షల 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా 2 వేల 761కు చేరింది. వరుసగా నాలుగోరోజు కూడా కేసుల సంఖ్య 3 లక్షలు దాటగా మరణాల సంఖ్య వరుసగా ఐదో రోజు కూడా 2 వేలను దాటింది. గడచిన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 10 లక్షలకు చేరగా.. ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 7 వేల 500కు చేరుకుంది.
భారత్‌లో ఇప్పటివరకు కోటి 69 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా ఈ మహమ్మారి బారిన పడి లక్షా 92 వేల మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఒక్కరోజులో కరోనా నుంచి 2 లక్షల 15 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో తప్ప మరే దేశంలో కూడా 50 వేలకు పైగా కేసులు నమోదు కావట్లేదు. దాయాది దేశం పాకిస్థాన్‌లో 5 వేల 800 కేసులు నమోదు కాగా.. బంగ్లాదేశ్‌లో 3 వేలు, నేపాల్‌లో 2 వేలు, శ్రీలంకలో కేవలం 969 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో మాత్రం ఏప్రిల్ 6 నుంచి ఏ ఒక్క రోజు కూడా కేసుల సంఖ్య లక్షకు తగ్గలేదు.
అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా రెండో ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకలో 20 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గకపోవడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేజ్రీవాల్.
కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండడంతో పలు రాష్ట్రాలు రాత్రివేళ కర్ఫ్యూను విధించాయి. వారంతపు రోజుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కర్ణాటక, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్‌లలో పాక్షిక లాక్‌డౌన్ అమల్లో ఉంటోంది. కేరళలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మహమ్మారిని నిలువరించేందుకు 48 గంటలపాటు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌తో ఉన్న సరిహద్దును ఒడిశా మూసివేసింది. తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20వేల మంది పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారుల నుంచి మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు సహా అన్ని చోట్లా నిఘా పెంచారు పోలీసులు.
అయితే మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ముంబయి మహానగరంలో కరోనా కేసులు మూడు వారాల కనిష్ఠానికి పడిపోయాయి. ఏప్రిల్ 4న నమోదైన 11,163 కేసులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వ యంత్రాంగం కేసుల తగ్గుదలను విజయంగానే భావిస్తోంది.
ఇక ఏపీ, తెలంగాణల్లో కూడా పరిస్థితి చేజారిపోతోంది. నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్నా.. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆసుపత్రులన్ని కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. . 29 లక్షల వరకు యాక్టివ్ కేసులు ఉండటం వల్ల వారికి చికిత్స అందించడానికి ఆసుపత్రులు, క్లినిక్‌లు చాలట్లేదు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ సరఫరా కొరతతో వేలాది ఇబ్బందులు పడుతున్నారు.