భారత్ బయోటెక్ నుంచి మరో టీకా!

భారత ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందిన స్వదేశీ ఔషద రంగ దిగ్గజం భారత్ బయోటెక్.. ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది. దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ టీకా అభివృద్దికి సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ముక్కు ద్వారా ఒక్క డోసులోనే కరోనా టీకాను అందించే విధంగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ముక్కు ద్వారా అందించే టీకా (బిబివి154) వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు, రోగ నిరోధకత, సవాళ్లను గుర్తించేందుకు భారత్, యూఎస్‌లో నిర్వహించిన ప్రీ క్లినికల్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మొదటి దశ మానవ ప్రయోగాలు 2021 ఫిబ్రవరి-మార్చిలో మనదేశంలో ప్రారంభం కానున్నాయి అని భారత్ బయోటెక్ వెల్లడించింది.
ముక్కు ద్వారా అందించే టీకా అభివృద్ధిపై ఇటీవల బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు మోతాదుల్లో అందించాల్సి ఉంటుందని, అందుకోసం 2.6 బిలియన్ల సిరంజీలు వాడాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. అవి కాలుష్యానికి కారణమవుతాయన్నారు. తమ టీకా భారత్ తలపెట్టిన భారీ టీకా కార్యక్రమ వ్యయంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపారు.