కరోనాపై పోరాటంలో మరో ముందడుగు!

కరోనాపై పోరాటంలో మరో కీలక ముందడుగు పడింది. టీకా వేసుకున్నప్పటికీ మహమ్మారి నుంచి తగినంత రక్షణ పొందలేకపోతున్న వ్యక్తుల కోసం ఆస్ట్రాజెనెకా సంస్థ ఆవిష్కరించిన ఇవుషెల్డ్ ఔషధ వినియోనికి అమెరికా అనుమతులు మంజూరు చేసింది. ప్రధానంగా క్యాన్సర్ వంటి తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు, అలర్జీలతో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారే అవకాశముంది. కొవిడ్ చికిత్సలో యాంటీబాడీ ఔషధాలను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ఇపుషెల్డ్‌ను మాత్రం తాత్కాలిక చికిత్స కోసం కాకుండా, దీర్ఘకాలిక నివారణ కోసం వినియోగించనున్నారు. ఈ ఇంజెక్షన్‌ను రెండుసార్లు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఆరు నెలల వరకు రక్షణ దక్కుతుందని చెబుతున్నారు. 12 ఏళ్లు దాటిన వారెవరైనాసరే ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీయే) తెలిపింది. కొవిడ్ సోకే ముప్పును ఇది 77 శాతం తగ్గిస్తుందని తెలుస్తోంది.