అర్జెంటీనాలో కరోనా విజృంభణ
లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనాలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే అక్కడ 14,687 కొత్త కేసులు నమోదయ్యాయి. గత మార్చిలో కరోనా విస్తరణ మొదలైనప్పటి నుంచి అర్జెంటీనాలో ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,79,689కి చేరింది. మొత్తం కేసులలో 6,14,515 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక కరోనా మరణాలు కూడా అర్జెంటీనాలో భారీగానే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 312 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 20,599కి చేరుకుంది. అర్జెంటీనా ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.






