ఏ వేరియంట్ కైనా ఒక్కటే వ్యాక్సిన్!

కరోనా కొత్త వేరియంట్‌లు పలు దేశాలపై విరుచుకుపడుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు ఈ వేరియంట్‌ల బారిన పడుతూనే ఉన్నారు. దీంతో ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్‌లు కొత్త వేరియంట్‌లపై ఎందుకు సమర్థవంతంగా పనిచేయడం లేదనే అంశంపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. కరోనా వేరియంట్ ఏదైనా ఒకేలా, అత్యంత సామర్థ్యంతో పనిచేసే కొత్త వ్యాక్సిన్‌ను రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ శాస్త్రేవేత్తలు, కరోనా వైరస్‌పై ఉండే కొమ్ముపై కాకుండా, వైరస్ మ్యుటేషన్‌కు కారణమయ్యే వైరల్ పాలిమరేస్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్ రూపొందించే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్‌లన్నీ కూడా వైరస్ స్పైక్ ప్రోటీస్‌తో తయారైవే. దీంతో శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే వ్యాక్సిన్‌లు దాన్ని గుర్తించి, రోగనిరోధక శక్తిని అప్రమత్తం చేస్తాయి. అయితే వైరస్ స్పైక్ ప్రొటీస్‌లో మార్పుల కారణంగా డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్‌లు వచ్చాయని, ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌లను గుర్తించలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.