అమెరికాలో అది సాధ్యమే …

వంద రోజుల్లో వంద మిలియన్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందచేసే లక్ష్యాన్ని చేరటం కచ్చితంగా సాధ్యమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 100 రోజుల్లో పది కోట్ల టీకా డోసులను ప్రజలకు అందజేస్తానని జో బైడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ లక్ష్యాన్ని చేరటం అసాధ్యమేమీ కాదని ఫౌచీ కూడా అభిప్రాయపడ్డారు. కాబోయే అధ్యక్షుడికి కొవిడ్ 19 వ్యవహారాల ముఖ్య సలహాదారుగా ఫౌచీని నియమించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వ సంస్థ సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ఇప్పటివరకు 31.1 మిలియన్ల డోసులను వివిధ కేంద్రాలకు రవాణ చేశారు. వాటిలో కేవలం 40 శాతం అంటే 12.2 మిలియన్ల మోతాదులను మాత్రమే ప్రజలకు ఇచ్చారు. ఈ నెల చివరి నాటికి 20 మిలియన్ల మందికి కరోనా టీకా తొలిడోసు లభించనుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.