దేశంలో కరోనా విజృంభణ… రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 459 మంది బలికావడం పరిస్థితి తీవ్రతను అద్దంపడుతోంది. 11,25,681 మందికి కొవిడ్ నిర్ధారణ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 72,330 మందికి పాజిటివ్‍గా తేలింది. అక్టోబర్ ప్రారంభంలో ఈ స్థాయి విజృంభణ కనిపించింది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,21,665కి చేరగా 1,62,927 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకూ క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 5,84,055 క్రియాశీల కేసులుండగా, ఆ రేటు 4.55 శాతానికి చేరింది. నిన్న 40,382 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.14 కోట్ల పైచిలుకు మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది. టీకా డ్రైవ్‍లో భాగంగా 6,51,17,896 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, ఒకరి ఒకరు మధ్య దూరం పాటించాలని సూచిస్తున్నారు.