అమెరికాలో మిగులు డోసులను.. భారత్ కు

కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‍కు మరింతగా సహాయాన్ని అందించాలని అమెరికా కాంగ్రెస్‍కు చెందిన 57 మంది సభ్యులు దేశ అధ్యక్షుడు జో బైడెన్‍కు లేఖ రాశారు. భారత్‍లోని వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అమెరికా చేయూత ఎంతో అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పంపించిన వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు, ఔషధాలు, వెంటిలేటర్లకు అదనంగా మరిన్ని అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చేసేందుకు అమెరికాలో మిగులుగా తేలిన ఆస్ట్రాజెనికా టీకా డోసులను భారత్‍కు పంపించాలని సూచించారు. దేశీయంగా టీకా ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన ముడి సరుకును కూడా సాధ్యమైనంత త్వరగా సరఫరా చేయాలని కోరారు. లేఖపై సంతకాలు చేసిన చట్టసభ సభ్యులో డెమోక్రాట్లు, రిపబికన్లు ఉన్నారు.