అందం కోసం ముక్కు కోసుకుంటున్నారు!
ఇప్పుడు చాలా మందికి సెల్ఫీలు తీసుకోవడమంటే మహా సరదా. ఈ సెల్పీల పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే, ఫొటోల్లో తమ ముక్కు పెద్దదిగా కనిపిస్తోందని, శస్త్రచికిత్స ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించాలంటూ ప్లాస్టిక్ సర్జన్ల దగ్గరకు అనేకమంది వరులు కడుతున్నారు. సెల్ఫీ ఫొటో తీసుకునేటప్పుడు ఫోన్ను ముఖానికి దగ్గరగా పెట్టాల్సి రావడం వల్లనే ముక్కు అలా కనిపిస్తోంది తప్ప వాస్తవానికి సమస్యేమీ లేదని వైద్యులు చెబుతున్నా వారు వినడం లేదు. దీంతో ప్లాస్టిక్ సర్జన్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికాలనోని ప్లాస్టిక్ సర్జన్ల పత్రిక జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ ఇటీవల ప్రచురించింది. ముఖానికి కెమెరా లెన్స్ 12 అంగుళాల కంటే తక్కువ దూరంలో ఉంటే సెల్ఫీల్లో ముక్కులు అసలు సైజు కన్నా 30 శాతం పెద్దగా కనిపిస్తాయి. ఇది గమనించకుండా అనేక మంది ఆపరేషన్ చేసి తమ ముక్కును అందంగా తీర్చిదిద్దాలంటూ తన క్లినిక్ వచ్చి అడుగుతున్నారని అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీలో పనిచేసే ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్ బోరిస్ పాష్కోవర్ తెలిపారు.













