మాల్యా విమానం అమ్ముడైంది
విజయ్ మాల్యా విలాసవంత జెట్ విమానాన్ని ఎట్టకేలకు సేవాపన్ను విభాగం విక్రయించ గలిగింది. 2016 మార్చి నుంచి నాలుగుసార్లు ప్రయత్నించినా, సఫలం కాలేకపోయిన సంగతి విదితమే. తాజాగా నిర్వహించిన ఇ-వేలంలో ఫ్లోరిడా (అమెరికా) కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఏవియేషన్ మేనేజ్మెంట్ సేల్స్ సంస్థ ఈ విమానానికి వేసిన రూ.34.8 కోట్ల (5.05 మిలియన్ డాలర్ల) బిడ్ అధికంగా నిలిచిందని అధికార వర్గాలు తెలిపాయి.
విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ 2012 అక్టోబరు వరకు కార్యకలాపాలు నిర్వహించింది. అయితే సేవాపన్ను జమచేయకపోవడంతో, రూ.800 కోట్ల బకాయిలు ప్రభుత్వానికి పేరుకు పోయాయి. వీటి వసూలు కోసం వివిధ ఆస్తులను విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా 2013 నుంచి ముంబయి విమానాశ్రయంలో నిలిపి ఉంచిన, విలాసవంత ఏ319 జెట్ విమానానికి ఇ-వేలం నిర్వహించారు.













