అమెరికా ఓపెన్ కష్టమే!
కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న అమెరికాలో ఈ ఏడాది జరిగే పలు ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. న్యూయార్క్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మకమైన అమెరికా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈసారి జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో అమెరికాలో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. అంతేగాక లక్షలాది మంది కరోనా కోరల్లో చిక్కుకుని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కరోనా దెబ్బకు వింబుల్డన్ ఓపెన్‌ను రద్దు చేశారు. మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌ను ఈ ఏడాది చివరికి వాయిదా వేశారు. అమెరికా ఓపెన్ ముగిసిన తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కరోనా వల్ల యూరప్ అల్లకల్లోలంగా మారిన స్థితిలో ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుందా అనేది అనుమానమే.
అమెరికాలో తాజాగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఈసారి యూఎస్ ఓపెన్ జరిగేది కష్టమేనని చెప్పాలి. రానున్న ఆరు నెలల పాటు అమెరికాలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా భయం పట్టిపీడిస్తున్న తరుణంలో యూఎస్ ఓపెన్ వంటి పెద్ద టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు సాహసం చేస్తారనేది సందేహమే. కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రపంచ వ్యాప్తంగా పూర్తి అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఆయా దేశాల్లో జరిగే పలు అంతర్జాతీయ టోర్నీలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీలను కరోనా వల్ల పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని వాయిదా వేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ ఏడాది చాలా టెన్నిస్ టోర్నీలు రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది.













