హెచ్-2బీ వీసాదారులకు శుభవార్త
హెచ్-2బీ వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. నిర్ణీత కోటాకు అదనంగా మరో 15 వేల వీసాలు జారీ చేయనున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది. హెచ్-2బీ ఉద్యోగులతో పాటు, వారి జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు వయసున్న సంతానానికి హెచ్4 వీసాలు ఇస్తామని ప్రకటించింది. సాధారణంగా అమెరికాలో వ్యవసాయేతర కార్మికులుగా పనిచేసే విదేశీయులకు హెచ్-2బీ వీసాలు జారీ చేస్తారు. ఏటా 66 వేల మందికి ఈ వీసాలను రెండు దశల్లో ఇస్తారు. ఆర్థిక సంవత్సరం అర్థభాగంలో 33 వేలు, ద్వితీయార్థం (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30) మరో 33 వేల వీసాలు జారీ చేస్తారు. ప్రస్తుత కోటాతోపాటు, తొలి అర్థభాగంలో మిగిలినవి, అదనంగా మరో 15వేల వీసాలను జారీ చేయనున్నట్టు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి కిర్స్ట్జెన్ ఎం నీల్సన్ తెలిపారు. హెచ్-2బీ వీసాల సంఖ్యను 66 వేలకు పరిమితం చేశాం. ఈ సారి హెచ్-2 బీ కేటగిరీ కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. దీనివల్ల అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదముంది. అందుకే మరో 15వేల వీసాలను అదనంగా జారీ చేస్తున్నాం అని ఆమె వివరించారు.













