హెచ్-4 రద్దు వద్దు
హెచ్- 4 వీసా విధానాన్ని రద్దు చేయొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మహిళా సెనేటర్లు కమలా హారిస్, కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్ లేఖ రాశారు. హెచ్-4 వీసాదారుల్లో 93 శాతం మంది భారతీయులే ఉన్నారని, వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ విధానాన్ని రద్దు చేస్తే భారీ సంఖ్యలో ఉన్న హెచ్-4 మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతారు. దీంతో వారు ఒంటరిగా మారి తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. ఇంట్లో తమ భాగస్వామిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రం, సమాన అవకాశాలు కల్పించడం అమెరికా నైజం. ఇక్కడ ఉద్యోగం చేయాలనుకునే హెచ్-4 వీసాదారుల అవకాశాన్ని కాలరాయడం ఈ దేశ నైతిక విలువలకు వ్యతిరేకం అని సెనేటర్లు వివరించారు. హెచ్-4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళా సెనేటర్లు ఈ లేఖ రాశారు.













