ఉద్దీపన నిధులను ఎవరికిచ్చారో చెప్పని ట్రంప్ సర్కార్
కరోనా నేపథ్యంలో ఉద్దీపన చర్యలతో పేరుతో అమెరికాలోని ట్రంప్ సర్కార్ దేశంలోని పన్ను చెల్లింపుదారుల సొమ్మును కార్పొరేట్లకు కట్టబెడుతోంది. అయితే ఆ సొమ్మును ఎవరికి ఎంత ఇచ్చారన్న దానిపై కార్పొరేషన్ల పేర్లను బయటకు వెల్లడించేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేయడం లేదు. ఇందుకు సంబంధించిన సమాచారం యాజమాన్యాలకు చెందినదని, రహస్య సమాచారంగా భావిస్తున్నామని ట్రెజరీ మంత్రి స్టీన్ మ్నుచిన్ కాంగ్రెస్కు తెలిపారు. ఇలా ప్రజల సొమ్మును ఎవరికి తరలిస్తున్నారో చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ లూఠీ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ వైఖరిపై ఉద్యమం చేసేందుకు కాంగ్రెస్తో పాటు, పలు సామాజిక సంస్థలు, కార్మిక సంఘాలు, తదితర సంఘాలు సిద్ధమౌతున్నాయి.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ సర్కార్ 500 బిలియన్ల డాలర్లతో కూడిన ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీంతో పాటుగా తరువాత ప్యాకేజీలో కూడా కార్పొరేట్లకు మరింత ఉపశమన చర్యలు తీసుకొస్తామని సెనెట్ మెజార్టీ లీడర్ మిచ్ మెక్కానెల్ ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పారు. చెల్లింపుదారులకు బిలియన్ డాలర్ల సొమ్మును ఎవరికీ కేటాయించారన్న విరాలు వారికి తెలియకుండా వ్యవహరించడం పూర్తిగా బాధ్యతరాహిత్యమని, ఇందులో కుట్ర దాగివుందని విమర్శలు పేర్కొన్నారు.













