చైనాను హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
తమతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని చైనా అమలు చేయాల్సిందేనని, కరోనా సాకు చెప్పి దాన్ని అమలు చేయకుంటే మొత్తం ఒప్పందాన్నే రద్దు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ దేశాన్ని హెచ్చరించారు. రెండేళ్లపాటు పరస్పరం సుంకాలను పెంచుకుంటూ వాణిజ్య పోరుకు తెరతీసిన ఉభయ దేశాలు.. ఈ ఏడాది జనవరిలో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికా నుంచి చైనా కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్వూ కమిషన్ ఇటీవల ఒక నివేదిక వెలువరించింది.
ప్రకృతి వైపరీత్యాలు, అనూహ్య విపత్తులు ఎదురైన పక్షంలో తాజాగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చన్న నిబంధనను చైనా తెరపైకి తీసుకురావచ్చని పేర్కొంది. దీనిపై ట్రంప్ స్పందించారు. తాజా ఒప్పందం ప్రకారం చైనా నడుచుకోవాలి. కరోనా సాకుతో తప్పించుకోవాలని చూస్తే.. మొత్తం ఒప్పందాన్నే రద్దు చేస్తాం. ఆ దేశంపై నాకంటే కఠినంగా వ్యవహరించేవారు మరెవరూ ఉండరు అని హెచ్చరించారు.













