వాటిని అణుబాంబుతో అడ్డుకోగలమా?
అమెరికాను తాకేలోపే హరికేన్లు (తుఫాన్లు)పై ఓ అణు బాంబు వేసి వాటిని అడ్డుకోవడానికి వీలుందా? అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారుల్ని అడిగారన్న వార్తలు అమెరికాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, దీనిని ట్రంప్ ఖండించారు. తాను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించలేదని చెప్పారు. అణుబాంబులతో హరికేన్లను అడ్డుకోవాలని తాను ఆలోచన చేసినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలు హాస్యాస్పదమని కొట్టిపారేశారు. అమెరికన్లను తరుచూ ఇబ్బందులకు గురిచేస్తున్న హరికేన్లను అణుబాంబులతో అడ్డుకోవడానికి వీలుందా? అని అధికారులతో జరిగిన అంతర్గత చర్చల్లో ట్రంప్ అడిగినట్టు ఒక మీడియా సంస్థ తన వెబ్సైట్లో వెల్లడించింది. ఈ వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. తీరాన్ని తాకేకంటే ముందే హరికేన్లను అడ్డుకోవడానికి తాను అణుబాంబులను వాడాలనుకుంటున్నట్టు ఆక్సియోస్ పేర్కొనడం హాస్యాస్పదం. నేనెప్పుడూ అలా అనలేదు. ఇది అసత్య వార్త అని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఈ కథనంపై స్పందించేందుకు శ్వేత సౌధం నిరాకరించింది. కాగా 1950లో ఓ శాస్త్రవేత్త తొలిసారిగా అణు బాంబులను వేసి హరికేన్లను అడ్డుకోవడం అనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.













