త్వరలోనే పాక్ ప్రధానితో సమావేశం : ట్రంప్
పాకిస్థాన్‌తో తాము గొప్ప సంబంధాలు కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన పాక్ ప్రధానితో త్వరలోనే సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ట్రంప్ తన క్యాబినెట్ సహచరులతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో ఆయన పాకిస్థాన్‌కు 1.3 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాము పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, కానీ వారు మాత్రం శత్రువులకు ఆశ్రయమిస్తున్నారని అన్నారు. పాక్ దేశాధినేతను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. తమ యంత్రాంగం తాలిబన్లతో శాంతి చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు.













