జో బైడెన్ పై నేనే గెలిచాను …
అధ్యక్ష సమరంలోని తొలి ముఖాముఖి చర్చలో ప్రత్యర్థి జో బైడెన్‌పై తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మిన్నెసొటాలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ బైడెన్‌తో జరిగిన ముఖాముఖి గురించి ప్రస్తావించారు. 47 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బైడెన్ చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు, ఆయన వైఫల్యాలను నేను గత రాత్రి ఎండగట్టాను. ఆ పార్టీ ప్రమాదకర ఎజెండాను బయటపెట్టాను. మీ ఉద్యోగాలు పోవడానికి కూడా వారే కారణం అని ట్రంప్ చెప్పుకొచ్చారు. బైడెన్ బలహీనుడని ఈ దేశాన్ని నడిపించేందుకు సరిపోరని విమర్శించారు. గత చర్చల్లో డెమొక్రాట్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అంతేకాగా, ఈ వైఫల్యంతో మిగిలిన చర్చలను రద్దు చేసుకోవాలని బైడెన్ మద్దతుదారులే ఆయనకు సూచిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ చర్చలో తాము గెలిచామని డెమొక్రాట్ పార్టీ కూడా ప్రకటించింది.













