అమెరికాలో తెలుగు వెలుగులు
అమెరికా సెన్సస్ బ్యూరో 2018 సంవత్సరానికి గాను అమెరికన్ కమ్యూనిటీ సర్వే నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికాలో 6.7 కోట్ల మంది ఇంగ్లీషు భాష కాకుండా మరో భాషను మాట్లాడుతున్నట్లు తెలిపింది. భారతీయ భాషల విషయానికి కొస్తే హిందీ పాపులర్ భాషగా నిలిచింది. ఆ తరువాత గుజరాతీ భాష రెండో స్థానంలో, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో గత ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషగా హిందీ ప్రథమ స్థానంలో నిలిచింది. 2018 జులై 1 నాటికి అమెరికాలో 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నట్లు సర్వే పేర్కొంది. 2010 నుంచి 2018 వరకు హిందీ మాట్లాడే వారి సంఖ్య 43.5 శాతం పెరిగింది. ఇక ఈ ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 79.5 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది. 2010లో 2.23 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా 2018 నాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2017తో పోలిస్తే తెలుగు మాట్లాడేవారి సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు సర్వే పేర్కొంది. 2017 నుంచి 4.15 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా గతేడాది అది 3.7 శాతం తగ్గింది. ఇక ఎనిమిదేళ్లలో బెంగాలీ మాట్లాడే వారు 68 శాతం ఉండగా, తమిళం, మాట్లాడే వారు 67.5 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది.













