అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా విద్యార్థి అడ్లూరు సాయికుమార్ (23) మృతి చెందాడు. వడమాలపేట మండలం ఎస్.బీ.ఆర్పురం గ్రామానికి చెందిన అడ్లూరు చంద్రశేఖర్ రాజు కుమారుడు సాయికుమార్ అమెరికా డెక్లాబ్ నగరంలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.చదువుతున్నాడు. శనివారం స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు సమీపంలోని ప్రాంతానికి కారులో వెళ్లాడు. వేడుకలు ముగిశాక తిరిగి బయలుదేరి వస్తుండగా, రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇల్లినాయిస్ వర్సిటీకి 5 కిలోమీటర్లు దూరంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనుక నుంచి ఢీ కొంది. ఈ ఘటనలో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్.బీఆర్పురంలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు భోరున విలపించారు. ఈ సమాచారాన్ని ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడారు. అనంతరం ఢిల్లీలోని అధికారులతో మాట్లాడి సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.













