అమెరికాలో తెలంగాణ వాసిపై కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన గోవర్ధన్‌రెడ్డి డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:30 గంటలకు స్టోర్‌లోకి చొరబడిన దుండగులు గోవర్ధన్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో గంటన్నరలో స్టోర్ మూసేసి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులుకు తెగబడిన దుండగులను నల్లజాతీయులుగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని ఫ్లోరిడాలోని శవాగారంలో భద్రపరిచారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసముంటున్నారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గోవర్ధన్‌రెడ్డి పెద్ద కుమార్తె పదో తరగతి, చిన్న కుమార్తె ఏడో తరగతి చదువుతున్నారు.













