హారీస్‌బర్గ్ లో తానా ఫుడ్ డ్రైవ్
హారీస్‌బర్గ్ లో ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా కేర్స్ కార్యక్రమంలో భాగంగా వివిధ చోట్ల అన్నార్తులకోసం తానా ఆహార పదార్ధాలను విరాళంగా అందజేస్తోంది. ఇందులో భాగంగా తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ (హారీస్‌బర్గ్) ఆధ్వర్యంలో రీజినల్ కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు, వెంకట్ సింగు, వెంకట్ నెల్లూరి, వెంకట్ చిమ్మిలి ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హారీస్‌బర్గ్‌లో ఉన్న కోవినంట్ కమ్యూనిటీ ఫుడ్ పాంట్రీకి వారు ఆహార పదార్థాలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ మల్లివేమన తదితరులు మిడ్ అట్లాంటిక్ టీమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.













