ప్రయోజనాత్మకంగా తామా, తానా కేర్స్ హార్ట్ హెల్త్ మరియు బోన్ డెన్సిటీ సదస్సు
తామా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) మరియు ‘తానా కేర్స్’ ఆధ్వర్యంలో హార్ట్ హెల్త్ సదస్సు మరియు ఉచిత బోన్ డెన్సిటీ పరీక్షలను ఫిబ్రవరి 1 న స్థానిక దేశాన మిడిల్ స్కూల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్. యల్. ఆర్ మార్ట్ గేజ్ వారు సమర్పకులు. ఈ మధ్య కాలంలో అమెరికా మరియు ఇండియాలో చాలామంది హృద్రోగాల బారిన పడటం తామా, తానా వారిని ఆలోచింపజేసి, ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి నెల హార్ట్ హెల్త్ మంత్ గా పరిగణించబడగా, యాదృశ్చికంగా ఇటువంటి అర్థవంతమైన సదస్సు ఇప్పుడే జరగటం విశేషం. సుమారు 200 మంది పాల్గొన్న ఈ సదస్సును తామా డైరెక్టర్ శ్రీరామ్ రొయ్యల ప్రారంభించి, తామా వీక్లీ ఫ్రీ క్లినిక్, 5కె వాక్ వంటి పలు ఆరోగ్య విశిష్ఠ కార్యక్రమాలను వివరించి, కార్యక్రమపు సదుద్దేశాన్ని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమపు ప్రధానవక్త మెట్రో అట్లాంటా ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ మరియు కార్డియోవాస్క్యూలర్ గ్రూప్ వ్యవస్థాపక భాగస్వామ్యులు డాక్టర్ శ్రీని గంగసాని వ్యవహరించి మరింత శోభను అందించారు. ఆయన ప్రసంగంలో భాగంగా, దక్షిణ ఆసియన్లను తరుచూ అధికంగా పీడించే హృదయ సంబధిత అస్వస్థతలను పేర్కొంటూ, నివారణకై వివిధ అమూల్య సూత్రాలను అందించారు. భారతీయులలో ఉన్న అపోహలు, అనుమానాలను చర్చిస్తూ వాటికి గురిచేసే ఇతరేతర కారణాలు మరియు వాటి లక్షణాలను గురించి క్లుప్తంగా వివరించారు. గుండె పోటు సమస్య మరియు దాని వల్ల కలుగు అకస్మాత్తు మరణాల సంఖ్య, ముఖ్యంగా దక్షిణ ఆసియన్లలో అధికంగా తటస్థపడటం ముఖ్యాంశంగా నిలిచింది. ఇరవై ఏళ్ళ ప్రాయమైనా ఈ విషయంలో మినహాయింపు లేకపోవడం గమనార్హం. ఈ విషయాలలో అప్రమత్తత అవసరం అంటూ హెచ్చరించారు. ముందస్తు మరియు రోగ గుర్తింపు చర్యల గురించి విశదీకరించారు. కాల్షియమ్ స్కోర్, లెవెల్స్ అఫ్ బ్లాకేజ్, ఆంజియోగ్రామ్ మరియు స్ట్రెస్ టెస్ట్ వంటి విభిన్న కరోనరీ ఆర్టరీ వ్యాధులను కొలవగల సాధనాలను పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వారు అమెరికాలో కూడా ప్రతి నలుగురిలో ఒకరి అస్వస్థతకు గుండె సమస్యలే ప్రధాన హానికారక కారణముగా గుర్తించారు. సదస్సులో వారందరూ ఎంతో శ్రద్ధగా, పరిపూర్ణంగా ఉపన్యాసమును ఆద్యంతం వింటూ గణనీయంగా పాల్గొనడం విశేషం. డాక్టర్ గంగసాని ఎక్స్పైర్డ్ వారెంటీ, ల్యాక్ అఫ్ స్పేర్ పార్ట్స్ వంటి ఛలోక్తులకు అధికంగా పాల్గొన్న మధ్య వయస్కులు హర్షాతిరేకాలతో స్పందించారు.
అనుకూల వాతావరణమున ఉపన్యాసం ముగియగా, మరొక ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ అమర్నాథ్ కొమ్మూరి మరియు డాక్టర్ గంగసాని సమర్థవంతంగా ప్రశ్నోత్తరాలను కొనసాగించగా, సభికులు మోడరన్ టెక్నిక్స్ ఆన్ హార్ట్ సర్జరీస్, వివిధ కొలెస్ట్రాల్ మెడికేషన్ తీరుతెన్నులు, వంశ పారపర్యంగా ఎదురయ్యే వ్యాధులు, రోజువారీ జీవనశైలిలో అవసరమైన మార్పులు మరియు ఎన్నో సమృద్ధ విశేషాలతో, సందేహాలతో ముందుకు రావడం అత్యంత ఆహ్లాదకరం.
డాక్టర్ నందిని సుంకిరెడ్డి ఎముకల ప్రాముఖ్యత గురించి, వయసు పెరిగేకొద్దీ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పారు. ఆడవారికి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఆమె ఫ్రీ బోన్ డెన్సిటీ చెకప్ నిర్వహించగా, ఎంతో మంది సభాసదుల ఈ అవకాశాన్ని వినియోగించుకుని, స్వస్థతకు విలువైన సూచనలను పొందారు.
తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంజయ్య చౌదరి లావు మరియు సౌత్ఈస్ట్ కోఆర్డినేటర్ కిరణ్ గోగినేని డాక్టర్ గంగసానిని సగౌరవంగా సత్కరించారు. అలానే తానా సంస్థ నిర్వహించే పలు కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. తామా ప్రెసిడెంట్ భరత్ మద్దినేని, చైర్మన్ రాజశేఖర్ చుండూరి, కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు డాక్టర్ కొమ్మూరి మరియు డాక్టర్ సుంకిరెడ్డిని సాదరంగా సత్కరించారు. హార్ట్ టు హార్ట్ మరియు ఈషా ఫౌండేషన్ సంస్థలు వారు తమ కార్యకలాపాలు, వాటివల్ల కలుగు లాభాలను అందరికీ వివరించారు. శ్రీరామ్ కార్యక్రమాన్నిముగిస్తూ, స్పాన్సర్ ఎస్. యల్. ఆర్ మార్ట్ గేజ్ వారిని, ఈ ప్రయోజనాత్మక సమావేశాన్ని మూలస్తంభాలుగా ముందుకు తీసుకువెళ్లిన డాక్టర్లకు, విచ్చేసిన అందరికీ, వాలంటీర్లకు మరియు తామా, తానా టీంలకు కృతజ్ఞతలు తెలియజేశారు.













