ప్రవాస భారతీయులకు తప్పని ముప్పు!
అత్యంత నైపుణ్యం ఉన్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయడానికి వీలు కల్పిస్తున్న వీసాలను నిషేధించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదన వల్ల దాదాపు లక్ష మంది తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రానుంది. వీసాదారులపైనే కాకుండా, వారి యజమానులపైనా ఇది వ్యతిరేక ప్రభావం చూపించనుందని ఒక అధ్యయనంతో తేలింది. విధానపరమైన మార్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయమై టెన్నెస్సీ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టఫర్ జె.ఎల్. కనింగ్హమ్, లైమ్రిక్ విశ్వవిద్యాలయంలోని కెమ్మీ బిజినెస్ స్కూల్కు చెందిన పూజా బి విజయకుమార్ దీనిని నిర్వహించారు. అనేకమంది తిరిగి వెనక్కి వెళ్లిపోవాల్సి రావడం వల్ల పరోక్ష ఖర్చులతో పాటు ఆయా ఒప్పందాల రద్దు రూపంలో 2.50 లక్షల నుంచి 10 లక్షల డాలర్ల మేర భారం పడుతుంది. తలెత్తబోయే వాస్తవ పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి విధానపరమైన మార్పులు చేస్తున్నారు అని వారు పేర్కొన్నారు.













