భక్తి పారవశ్యంలో మిస్సోరి.. వైభవంగా సామూహిక సహస్ర కుంకుమార్చన
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం, సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. వేదమంత్రాలు, హోమ గుండాలతో యాగశాల పరిసరాలు పవిత్రంగా మారాయి.
నాలుగో రోజు ప్రధాన కార్యక్రమాలు:
నాలుగో రోజు గోమాత పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం మహాన్యాస పారాయణం, రుద్రహోమం, సుదర్శన హోమం, చండీ పారాయణం చండీ హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన ‘ప్రత్యంగిరా హోమం’ నిర్వహించడం విశేషం. (1000 Lotus Homam)
సామూహిక సహస్ర కుంకుమార్చన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్తర అమెరికాలో ఇంత భారీ స్థాయిలో, సామూహికంగా నిర్వహించిన తొలి కుంకుమార్చన ఇదే కావడం గమనార్హం. మహిళలందరూ ఎరుపు రంగు వస్త్రధారణతో భక్తిశ్రద్ధలతో పాల్గొని, ఆలయ కమిటీ అందించిన ప్రత్యేక పూజా సామాగ్రితో అమ్మవారిని ఆరాధించారు.
పూజా ప్రాంగణంలో శ్రీచక్రాన్ని అద్భుతంగా అలంకరించారు. అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించారు. ఈ సందర్భంగా భక్తులకు పవిత్రమైన రుద్రాక్షలను ప్రసాదంగా అందించారు.
అన్నప్రసాద వితరణ నిర్వహణ…
ఈ మహాయజ్ఞానికి విచ్చేసిన దాదాపు 4,000 మంది భక్తుల కోసం ఫుడ్ కమిటీ అధ్యక్షురాలు పల్లవి సూరపనేని, కమిటీ సభ్యులు రాజేష్ ఏవూరి, సతీష్ లంకల నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
నిర్వాహకుల పిలుపు…
జూలై 19వ తేదీ ఆదివారంతో ఈ మహాయజ్ఞం ముగియనుంది. కాబట్టి, ప్రవాస భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ పుణ్యకార్యంలో పాల్గొని, అమ్మవారి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్ మీడియా సమన్వయకర్త రాజా సూరపనేని కోరారు.
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








