కోలుకుంటున్న అమెరికా కాల్పుల బాధితుడు సాయికృష్ణ
అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్ నగరంలో గుర్తు తెలియని దుండగుడి కాల్పుల్లో గాయపడిన మహబూబాబాద్ పట్టణ వాసి పూస సాయికృష్ణ కోలుకుంటున్నాడు. ఈ నెల మూడో తేదీన కాల్పుల ఘటన జరగగా తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను అక్కడి ట్రాఫిక్ పోలీసులు హెన్రీఫోర్డ్ ఆస్పత్రిలో చేర్చారు. తమ కుమారుడు క్రమంగా కోలుకుంటున్నట్టు అతని స్నేహితులు తెలిపారని బాధితుని తండ్రి ఎల్లయ్య తెలిపారు. మిత్రులే అతని యోగక్షేమాలు చూసుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాకు వెళ్లేందుకు వీసాలు సిద్దం చేసుకుంటున్నామని వెల్లడించారు. ఇదిలా ఉంటే బాధితుని వైద్యానికి అవసరమైన డబ్బు సేకరించేందుకు గాను స్నేహితులు నాగేందర్, వినోద్ సపోర్ట్ సాయికృష్ణ అనే పిలుపుతో గోఫండ్మీ.కామ్ అనే వెబ్సైట్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు.













