మైక్ పాంపియోతో జై శంకర్ చర్చలు
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఫోన్లో మాట్లాడుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. కరోనా మహమ్మారి, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా వారు మాట్లాడుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతల కోసొం ఇరు దేశాలు కలసి పని చేస్తాయని వారిద్దరు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తూ ముందూకు సాగాలని వారు నిర్ణయం తీసుకున్నారు. భారత్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ చర్చలకు ప్రాధాన్యం నెలకొంది. భారత సరిహద్దులతో పాటు ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చైనా దూకుడు చర్యలను కట్టడి చేసేలా భారత్, అమెరికా మధ్య బంధం మరింత బలపడాలని ఇటీవలే అమెరికా చట్ట సభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారత్కు తమ దేశం అన్ని విధాల అండగా ఉంటుందని వారు చెప్పారు.













