అమెరికాకు రష్యా హెచ్చరిక
వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా అనుచిత జోక్యం చేసుకోవద్దని రష్యా హెచ్చరించింది. రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేశారు. వెనిజులాలో రష్యా సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తుందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె అన్నారు. వెనిజులాను ప్రతిరోజూ బెదిరిస్తూ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న అమెరికాకు అంతర్జాతీయ చట్టాలన్నా, ఐరాస నియమావళి అన్నా అసలు గౌరవం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకే తాము ఆ దేశానికి సైనిక పరమైన సాంకేతిక సహకారాన్ని మాత్రమే అందిస్తున్నామని ఆమె వివరించారు. వెనిజులాలో రష్యా సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తోందంటూ అమెరికా చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని ఆమె సృష్టం చేశారు. తాము వెనిజులాకు చట్టబద్ధమైన సహకారం అందిస్తుంటే తమను ఆంక్షలతో బెదిరించాలనుకోవటం అమెరికా మూర్ఖత్వమే అవుతుందని ఆమె పేర్కొన్నారు. వెనిజులా ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య చర్చల ద్వారా సయోధ్యకు తాము ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు.













