కాలిఫోర్నియాలో భారత సంతతి పోలీసు కాల్చివేత
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీసు అధికారిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కార్పోరల్ రొనిల్ సింగ్ (33) న్యూమాన్ పోలీస్ విభాగంలో ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆయన క్రిస్మస్ రోజు రాత్రి ఓవర్‌టైమ్ డ్యూటీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విధుల్లో భాగంగా ట్రాఫిక్‌ను ఆపుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రొనిల్ను తుపాకితో కాల్చి పారిపోయారు. కాల్పులు గురించి తెలిసి అధికారులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి రొనిల్ బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా రొనిల్ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతి వాహనానికి సంబంధించిన సీసీటీవీ పుటేజీని విడుదల చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రొనిల్ సింగ్‌కు భార్య అనామిక, ఐదు నెలల కుమారుడు ఉన్నారు. రొనిల్ మృతిపట్ల కాలిఫోర్నియా గవర్నర్, న్యూయార్క్ పోలీసు విభాగం, భారతీయ అధికారుల సొసైటీ సంతాపం తెలిపారు.













