త్వరలో గుడ్ న్యూస్ : ట్రంప్
తమ దేశంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి తాము చేస్తున్న అత్యంత విస్తృతమైన కరోనా పరీక్షలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మరే దేశంలోనూ ఈ విధంగా పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా మరే దేశంలోను లేని విధంగా మరణాల సంఖ్య కూడా అత్యంత తక్కువగా తమ దేశంలోనే ఉందని కూడా వైట్‌హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన చెప్పారు. పరీక్షలు చేస్తేనే కేసులు బయటపడతాయని, మేము విస్తృత రీతిలో పరీక్షలు జరుపుతున్నందువల్లే కేసులు సంఖ్య పెరుగుతోందని ట్రంప్ అన్నారు. కొన్ని దేశాలలో రోగి ఆస్పత్రికి వెళితేనే పరీక్షలు జరుపుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అందుకే వారి వద్ద కేసులు ఉండడం లేదని, మన వద్ద ఇన్ని కేసులు వస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. కరోనా ఎదుర్కోవడంలో మనం చాలా విశేషమైన కృషి చేస్తున్నామని, వ్యాక్సిన్‌ను కనుగొనడంలో కాని, రోగులకు వైద్యం అందచేయడంలో కాని, మన కృషి గొప్పగా ఉందని ఆయన అన్నారు. త్వరలోనే ఒక శుభవార్తను వినగలమని భావిస్తున్నామని ఆయన ప్రకటించారు.













