భగ్గుమంటున్న అగ్రరాజ్యం
అమెరికాలోని మినియాపోలిస్‌లో ఆఫ్రికన్- అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు అధికారి ఒకరు కర్కశంగా హతమార్చిన ఘటనపై నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా దానిని ధిక్కరించిన మరీ ప్రజలు వేలసంఖ్యలో బయటకు వచ్చి ఉధ్యమిస్తున్నారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం ఆదివారం కూడా కొనసాగింది. ఒకపక్క కరోనా కేసుల ఉద్ధ•తి, మరోపక్క నిరసనలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిరసనకారుల్లో దాదాపు 4000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్‌లోని మన్హటన్, ట్రంప్ టవర్, కొలంబస్ సర్కిల్, బ్రూక్లిన్ తదితర ప్రాంతాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రంతా అమెరికాలో ఏదో ఒక చోట హింసా కొనసాగింది. కార్లు వ్యాపార సముదాయాలకు నిప్పు పెడుతున్నవారిని చెదరగొట్టడానికి రబ్బురు తూటాలు, బాష్ప వాయువులను ప్రయోగించారు. కొన్నిచోట్ల దుకాణాలను కొల్లగొట్టిన ఆందోళనకారులు వాటిలో ఉన్న టీవీలు, ఇతర వస్తువులను ఎత్తుకుపోయారు. అట్లాంటా, లాస్ఏంజిలెస్, శాన్ఫ్రాన్సిస్కో సియాటిల్ సహా 16 రాష్ట్రాల్లో 30కి పైగా నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.













