ఐరాసలో ప్రధాని మోదీ యోగా.. గిన్నిస్ రికార్డు
ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా అధికారికంగా, ప్రధాని మోదీ సారథ్యంలో సాగిన యోగా సెషన్ గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా అనేది కాపీరైట్లు, పేటెంట్, రాయల్టీ చెల్లింపుల వంటి మేధోపర హక్కులను అతీతం. లింగబేధం లేకుండా అన్ని వయసుల వారికి ఆరోగ్య యోగ్యతతో సంబంధం లేకుండా అందరికీ అనువైనది యోగా. నిజంగా యోగా విశ్వజనీనం, విశ్వవ్యాప్తం అని వ్యాఖ్యానించారు. తొలుత న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలోని ఉత్తరవైపు ప్రాంగణం లోని గాంధీజీ ప్రతిమకు మోదీ నివాళులర్పించారు. తర్వాత పలు దేశాల ప్రతినిధులను యోగా సెషన్‌లోకి స్వాగతం పలికారు. యోగా కోసం అన్ని దేశాల ప్రతినిధులు ఇలా ఒక్కటిగా కలసి రావడం అద్బుతంగా ఉంది. ఈ రోజు ఇక్కడ ప్రతీ జాతీయునికీ సమ గౌరవం దక్కుతోంది అని అన్నారు.
ఐరాస సర్వ ప్రతినిధి సభ 77వ సెషన్ అధ్యక్షుడు కసాబా కొరిసి, న్యూయార్క్ మేయర్ ఎరిక్, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే, అయ్యంగార్ యోగాతో చిరపరిచితమైన డియిడ్రా డీమెన్స్, ప్రముఖ అమెరికా గాయని మేరీ మిల్బెన్సహా పలు ప్రపంచ దేశాల ప్రతినిధులు యోగా చేశారు. ఇలా ఒకేసారి ఒకేచోట అత్యంత ఎక్కువ దేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్న యోగా సెషన్‌గా ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డును నమోదు చేసుకుంది. సెషన్లో ఐరాస ఉన్నతాధికారులు, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ఐరాస సభ్యదేశాల ప్రతినిధులు, ప్రపంచ స్థాయి ప్రముఖులు, భిన్న సంస్థల వ్యక్తులు పాల్గొన్నారు. భిన్న పోకడలతో విచ్చిన్నమవుతున్న ప్రపంచం నేడు యోగాలాంటి అత్యంత అమూల్యమైన విధానం నుంచి ఎంతో నేర్చుకోవాలి ప్రయోజనం పొందాలి అని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ అన్నారు.













