NATS: కట్టమూరులో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

నాట్స్ సేవ కార్యక్రమాలపై కన్నా ప్రశంసలు
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం కట్టమూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. కట్టమూరు గ్రామానికే చెందిన నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి చొరవతో ఏర్పాటైన ఈ ఉచిత వైద్య శిబిరంలో స్థానికులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. అవసరమైన మందులు అందించారు. 50 మందికి నాట్స్ ఉచితంగా కళ్ల అద్దాలను అందించింది. సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ, నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణలు ప్రారంభించారు. అమెరికాలో ఉంటున్న సొంత గ్రామం మేలు కోసం ఆలోచించడం అభినందనీయమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై కన్నా ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ అధ్యక్షుడి స్థానంలో తన సొంత గ్రామానికి వచ్చిన శ్రీహరిని కట్టమూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.