అమెరికా చదువుకు దూరం
అమెరికాలో ఉన్నత చదువుకు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక, వీసా, వర్క్ వీసా నిబంధనల్ని కఠినతరం చేయటం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులు చదవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2016-17 మధ్యకాలంలో 21 శాతం తగ్గిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ (ఎస్ఎఫ్ఏపీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం భారతీయ విద్యార్థుల విదేశీ విద్యావకాశాల్ని దారుణంగా దెబ్బకొట్టిందని అధ్యయనం అభిప్రాయపడింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అందించిన సమాచారం ఆధారంగా ఎస్ఎఫ్ఏపీ ఈ వివరాలు వెల్లడించింది.
ఇతర దేశాల నుంచి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి వచ్చే వారి సంఖ్య కూడా 2016-17 మధ్యకాలంలో 4శాతం తగ్గిందని తెలిపింది. దీనిలో భారత్ నుంచి వచ్చి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులే అధికం. భారత్ నుంచి వచ్చే విద్యార్థులే అమెరికా కంపెనీలకు ప్రధాన మానవ వనరులుగా ఉంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన వీసా, వర్క్ నిబంధనలే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణం. పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరతా కొంతవరకూ ఈ పరిస్థితికి కారణమే. చదువు తరువాత ఉద్యోగ అవకాశాలు లేకపోవటం ఈ తగ్గుదలకు ప్రధానం కారణం అని ఎస్ఎఫ్ఏపీ విశ్లేషించింది. భారత విదేశీ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 2017లో 2,06,708 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు.













