టీఎమ్మార్ విద్యార్థులకు నాసా ఆహ్వానం
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల (టీఎమ్మార్)లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరుగనున్న సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. లాస్ఏంజిల్స్లో ఐఎస్డీసీ సెంటర్లో మే 24 నుంచి 27 వరకు ఈ సమావేశం జరుగనున్నది. టీఎమ్మార్కు చెందిన సఫామాహీన్ (9వ తరగతి), సయ్యద్ ఇబ్రహీం అలీ, ముస్కాన్ తబస్సుమ్, ఫిరోజ్ అహ్మద్ (8వ తరగతి), మాహిన్ మహ్మదీ, మహ్మద్ ఫిరోజ్ హుస్సేన్ (7వ తరగతి)లకు నాసా కేంద్రాన్ని సందర్శించేందుకు పిలుపువచ్చింది.
ప్యూజన్ ఎల్-5 అంశంపై ఆరుగురు విద్యార్థులు కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ నివేదికను నాసా ఆమోదించింది. ఆ మేరకు వీరిని మేలో జరిగే సమావేశానికి రావాలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్)కి లేఖ రాసింది. నాసా పర్యటన సందర్భంగా వ్యోమగామి ఆండ్రిన్ ఈ ఆరుగురు విద్యార్థులను కలువనున్నట్లు టెమ్రీస్ కార్యదర్శి షఫీఉల్లా తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు నాసా నుంచి ఆహ్వానం రావడం రాష్ట్రంలోనే తొలిసారని, విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని ఆయన పేర్కొన్నారు.













