అంతరిక్షంలో సెల్ఫీలు దిగొచ్చు!
మన పాలపుంత మధ్యలో నిలబడి సెల్ఫీలు దిగాలనుకుంటున్నారా? స్పేస్‌సూట్ వేసుకొని నక్షత్రాల మధ్య విహరిస్తూ ఫొటోలకు పోజులివ్వాలన్న కోరిక మీకుందా. అయితే నాసా కొత్తగా లాంచ్ చేసిన ఈ యాప్‌న వాడి చూడండి. నాసా సెల్ఫీస్ పేరుతో ఈ యాప్ లాంచ్ అయింది. దీంతోపాటు ఓ వర్చువల్ రియాలిటీ (వీఆర్) యాప్‌ను కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా వీఆర్ యూజర్స్ ట్రాపిస్ట్-1 ప్లానెటరీ సిస్టమ్ టూర్‌కు తీసుకెళ్లనున్నారు. ట్రాపిస్ట్ -1 మన సౌర కుటుంబం బయట ఉన్న మరో గ్రహాల వ్వవస్థ. ఇందులో భూమిలాంటి ఏడు గ్రహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే.
స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 15వ యానివర్సరీని పురస్కరించుకొని ఈ యాప్స్ లాంచ్ చేసినట్లు నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. సెల్ఫీస్ యాప్ ద్వారా ముందు మీ సెల్ఫీ దిగి, అందులోని ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్‌ను సెలక్ట్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడమే. ఈ యాప్ అటు ఐఓఎస్, ఇటు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. స్పిట్జర్ టెలిస్కోప్ అందించిన చిత్రాల తాలూకు వివరాలను కూడా ఈ యాప్ యూజర్లకు అందిస్తుంది.













