Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లి, కుమార్తె మృతి!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డికాలనీకి చెందిన తల్లి, కుమార్తె.. అమెరికాలోని చికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Accident) మరణించారు. ఈ ఘటనతో వారి స్వస్థలంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతులను విశ్రాంత సింగరేణి కార్మికుడు పాత విఘ్నేష్ భార్య రమాదేవి (55), ఆమె చిన్న కుమార్తె తేజస్వి (30)గా గుర్తించారు. విఘ్నేష్, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. అతని చిన్న కుమార్తె తేజస్వి గృహ ప్రవేశ కార్యక్రమం కోసం విఘ్నేష్ దంపతులు సెప్టెంబరు 18న అమెరికా వెళ్లారు. శుక్రవారం రాత్రి 9-10 గంటల ప్రాంతంలో పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడు నిశాంత్ జన్మదిన వేడుకలకు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారును చికాగో సమీపంలో ఒక టిప్పర్ లారీ బలంగా (Accident) ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రమాదేవి, తేజస్వి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకు గాయాలైనట్లు మంచిర్యాలలోని బంధువులకు సమాచారం అందింది. ఒకే కుటుంబంలో తల్లి, కుమార్తె హఠాన్మరణం చెందడంతో రెడ్డికాలనీలోని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.