ఏ రోజుకారోజు నిధులతో నెట్టుకొస్తున్న అమెరికా
అమెరికా ప్రభుత్వం దినదినగండం నూరేళ్ల ఆయుష్షు లా కాలం వెళ్లదీస్తోంది. శుక్రవారం నాటికల్లా నిధులు విడుదల కాకపోతే దేశంలో పలు ప్రభుత్వం విభాగాల కార్యకలాపాలు స్తంభించపోనున్నాయి. అనేక మంది ప్రభుత్వ సిబ్బందిని తాత్కాలికంగా పనుల నుంచి తొలగించాల్సి రానుంది కూడా. ఈ దుస్థితిని నివారించడానికి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నామని అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం మూతడకుండా ఉండటానికి మొదట గురువారం నాడు కొన్ని నిధులు విడుదల అవుతాయని దిగువ సభ ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు.
గడిచిన అయిదు నెలల్లో ఇలా హడావిడి నిధులతో సర్కారు బండిని నడపడం ఇది నాలుగోసారి. మార్చి 8కి ముందు వ్యవసాయ, రవాణా, హోం శాఖల బిల్లులను, మార్చి 22న రక్షణ విదేశాంగ తదితర శాఖల బిల్లులను ఆమోదించి పాలనా రథం ముందుకు కదిలేట్లు చూస్తారు. దిగువ సభలో పాలక డెమోక్రాట్ల కన్నా ప్రతిపక్ష రిపబ్లికన్లకే స్వల్ప మెజారిటీ ఉంది. ఎగువ సభ సెనెట్‌లో పాలక పార్టీకి స్వల్ప ఆధిక్యత ఉంది. దీంతో దిగువ సభ రిపబ్లికన్లు ముఖ్యమైన బిల్లులను అడ్డుకోగలుగుతున్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇతర మిత్రదేశాలకు అత్యవసర సాయానికి ఉద్దేశించిన 9,500 కోట్ల డాలర్ల బిల్లుకు మాత్రం ఇప్పటికీ అతీగతీ లేదు.







