ప్రభుత్వ స్కూళ్లను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకోండి : రాజేంద్రప్రసాద్
న్యూజెర్సీ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా న్యూజెర్సీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభకు ఎమ్మెల్సీ యలమంచిలి వెంకటబాబూ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవాస తెలుగు ప్రజలు తమ జన్మభూమి రుణం తీర్చుకోవాలని, తమ గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న ఎన్ఆర్ఐలు తాము చదువుకున్న స్కూళ్ళ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రక్షాళనచేసి, నాణ్యమైన విద్యను పిల్లలకు అందిచటానికి ఎన్ఆర్ఐలందరూ నడుంబిగించాలన్నారు. స్వచ్ఛభారత్ కన్నా విద్యా భారత్ ఇంకా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌ల ఆధ్వరంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. ఏపీలోని 13 వేల గ్రామలలో సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, వీధి దీపాలు మొదలైన సదుపాయాలు నూరుశాతం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అనంతరం తానా ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీవుడ్ పోటీల్లో విజేతకు రాజేంద్రప్రసాద్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన తానా సభ్యులు శాలువాతో సత్కరించి మొమొంట్లో అందజేశారు. ఈ కార్యక్రమానికి తానా సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ప్రవాస భారతీయులు తదితరులు పాల్గొన్నారు.













