గ్రంథాలయోద్యోగికి అమెరికా డాక్టరేట్
ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదన రాజుకు అమెరికాకు చెందిన కింగ్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన మధుసూదన రాజుతో పాటు ఏపీ హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్న ధారా సత్యనారాయణకు కూడా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. పౌర గ్రంథాలయాల అభ్యున్నతికి, సామాజిక సేవలో విశేష ప్రతిభ కనబరిచినందుకు రాజుకు, న్యాయ సదస్సులు, దూరదర్శన్‌లో చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు సత్యనారాయణ ఈ నెల పదో తేదీన విజయవాడలో డాక్టరేట్లు పొందనున్నారు.
ఏపీ పౌర గ్రంథాలయ శాఖ చరిత్రలో ఒక ఉద్యోగి తొలిసారిగా డాక్టరేట్ పొందడంపై గ్రంథాలయోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2013లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అయ్యంకి వెంకట రమణయ్య సేవా కీర్తి పురస్కారాన్ని కూడా మధుసూధనరాజు అందుకున్నారు.













