ఐటీ ఉద్యోగులకు శుభవార్త
ఐటీ ఉద్యోగంలో రాణించాలనుకునే గ్రాడ్యుయేట్లు, ఏదైనా సంస్థ నుంచి తొలగించబడిన, విదేశాల్లో స్థిరపడాలనుకునే ఐటీ నిపుణులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పుల కారణంగా గత కొన్నేళ్ల నుంచి భారత్‌లో ఐటీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జపాన్ దేశం దాదాపు 2 లక్షల మంది భారత ఐటీ నిపుణులను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెరికా హెచ్ 1బీ వీసాలను పొందడానికి నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వాటి సంఖ్యను తగ్గిస్తూ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లాలనుకునే వారికి నిరాశే ఎదురైంది. తాజాగా జపాన్ నిర్ణయంతో ప్రతిభగల భారత ఐటీ నిపుణులకు ఊరట లభించనుంది.
ప్రత్యేకంగా లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, సర్వీసెస్, అగ్రీకల్చర్ రంగాల్లో అత్యంత నైపుణ్యం గల నిపుణులను నియమించుకునేందుకు జపాన్ ఆసక్తి చూపిస్తోంది. ఒక ఏడాది వ్యవధిలో శాశ్వత నివాస హోదా పొందడానికి ఎంపికైన ఉద్యోగాలకు గ్రీన్‌కార్డ్ కూడా ఇచ్చేందుకు సహకరిస్తామని చెబుతోంది. భారతదేశం నుంచి దాదాపు 2 లక్షల మంది ఐటీ నిపుణులకు జపాన్ తలుపులు తెరుస్తోంది. ఇక్కడ స్థిరపడటానికి గ్రీన్ కార్డులు ఇవ్వడంతోపాటు అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మౌలికవసతులకు సాయం అందించడానికి జపాన్ సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జేఈటీర్వో) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిజెకీ మైద తెలిపారు.













