కాలిఫోర్నియాలోని నగరానికి మేయర్ గా భారతీయుడు
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త హారిసింగ్ సిద్ధు కాలిఫోర్నియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన అనాహైమ్ నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2012 వరకు అనాహైమ్ నగర కౌన్సిల్లో సభ్యుడిగా వ్వవహరించిన ఆయన నవంబర్ 6న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మేయర్గా గెలుపొందారు. ఈ నగరానికి ఆయన మొదటి సిక్కు మేయర్గా గెలుపొందటం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఈ పదవికి ఎన్నికైనందుకు గర్వపడుతున్నానని చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని తెలిపారు. భారత దేశంలో పుట్టిన సిద్ధు 1974లో తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ గెలుపుతో అమెరికాలోని కొద్దిమంది సిక్కు మేయర్ల సరసన నిలిచారు.













