ఎఫ్ ఏటీఎఫ్ నిర్ణయాన్ని స్వాగతించిన భారత్, అమెరికా
ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిన పాకిస్థాన్‌ను ఆర్థిక కార్యాచరణ ప్రత్యేక దళం (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో చేర్చడంపై భారత్, అమెరికా దేశాలు స్వాగతించాయి. పాక్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని హితవు పలికాయి. దీనిపై భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్‌కుమార్ స్పందిస్తూ ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్‌పై అనర్హత వేటు వేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఎఫ్ఏటీఎఫ్ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ పాక్ తన తీరు మార్చుకుని ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. నిషేధం విధించిన ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా నిలిచింది. వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చింది. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయిద్, ఉగ్రసంస్థలైన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ సంస్థలు పాకిస్థాన్‌లో ఉంటు తమ ఉగ్రకార్యకలాపాలను నిర్వహిస్తునే ఉన్నాయి. అటువంటివి ఇకపై జరగకుండా పాక్ తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని రవీశ్‌కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆవాసంగా మారిన పాకిస్థాన్‌పై సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని అమెరికా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.













