భారత్, పాక్‌ల మధ్య కుదిరిన ఒప్పందం
కీలకమైన కర్తార్‌పూర్ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్‌లు సంతకాలు చేశాయి. గుర్దాస్పూర్ దగ్గర డేరా బాబా నానక్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద ఇరు దేశాల అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో కార్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. భారతీయులు లేదా భారత సంతతికి చెందిన వారందరూ ఈ కారిడార్ ద్వారా వీసా లేకుండానే కర్తార్‌పూర్‌లో గల గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు చేరుకోవచ్చు. కేవలం పాస్‌పోర్ట్ కలిగి ఉంటే చాలని అంతర్గత భద్రత జాయింట్ సెక్రెటరీ సీఎల్ దాస్ తెలిపారు. అయితే సర్వీస్ చార్జి కింద ప్రతి యాత్రికూడు 20 డాలర్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరంలో అన్ని రోజులు యాత్రికులు గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు చేరుకోవచ్చని, ఇందులో ఏమైనా మార్పులుంటే ముందుగా సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు.
పాక్‌లో యాత్రికులకు అవసరమయ్యే సౌకర్యాలన్నీ అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు దాదాపు 5000 మంది యాత్రికులకు కర్తార్‌పూర్ సందర్శించేందుకు అవకాశం కల్పించనున్నారు. నవంబర్ 9న కార్తార్‌పూర్ ప్రారంభోత్సావానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.













