బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే…మనం గెలిస్తే ఓహియో గెలిచినట్టే
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఒక రాజకీయ నేతగా అయిదు దశాబ్దాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించారని, నవంబర్ 3 ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి అయిన బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. బిడెన్ (77), అయన సన్నిహిత అభ్యర్థి కమలాహారిస్ అధ్యక్షుడు ట్రంప్ (74). ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు దీటైన ప్రత్యర్థులుగా ఉన్నారు. బిడెన్ 47 సంవత్సరాలు పదవిలో ఉన్నా మీ ఉద్యోగాలు చైనాకు, ఇతర దేశాలకు రవాణా చేయించారని, తాను గత నాలుగేళ్లలో తిరిగి స్వదేశానికి ఓహియోకు ఉద్యోగాలు రప్పించగలిగానని డేటన్, ఓహియోల్లో ఎన్నికల ర్యాలీల సందర్భంగా పేర్కొన్నారు.
నవంబర్ 3 నాటి ఎన్నికల్లో మన దేశాన్ని నూతన పురోగతి శిఖరాలకు తీసుకెళ్తారో లేక జో బిడెన్, వంటి వారికి అవకాశం ఇచ్చి ఆర్థిక ప్రగతిని అధోగతి పాలు చేస్తారో అమెరికా ప్రజలు నిర్ణయిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. నాలుగు ట్రిలియన్ డాలర్ల పన్ను పెంపు, ఓహియో బొగ్గు, చమురు, సహజవాయువుల ఒప్పందం రద్దు, చైనా తదితర దేశాలకు ఉద్యోగాల తరలింపు ఇవన్నీ బిడెన్ ఎన్నిక వల్ల ఎదురయ్యే పరిణామాలుగా ట్రంప్ ఆరోపించారు. బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే, మనం గెలిస్తే ఓహియో గెలిచినట్టే అని అర్థం చేసుకోండని ట్రంప్ వ్యాఖ్యానించారు.













