భారత మీడియాపై ట్రంప్ జూనియర్ ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ భారత మీడియాపై ప్రశంసలు కురిపించారు. గ్లోబల్ బిజినెస్ సదస్సులో మాట్లాడిన ఆయన తనకు భారత మీడియా అంటే చాలా ఇష్టమని అన్నారు. అమెరికా మీడియాతో పోలిస్తే ఇక్కడ మీడియా చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. భారత చరిత్రలో ఐ లవ్ ఇండియన్ మీడియా అని చెప్పిన తొలి వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. అమెరికా మీడియాను దూకుడు కలిగిన, భయంకరమైన మీడియాగా, భారత మీడియాను సున్నితమైన,చక్కని మీడియాగా అభివర్ణించారు. భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ముఖాలు చిరునవ్వుతోనే ఉంటాయని అన్నారు. తాను భారత్కు రావడం మొదటిసారి కాదని, గత పదేళ్లలో భారత్ సందర్శిస్తూనే ఉన్నానని తెలిపారు. దీన్ని బట్టి తాము భారత్కు ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చన్నారు. రాజకీయాలపై మాట్లాడడానికి నిరాకరించారు. తాను వ్యాపారవేత్తగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. భారత్లో వ్యాపార అవకాశాలు బాగా పెరిగాయని, ఇక్కడ పెట్టుబడులు అధికంగా పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని అన్నారు.













