వృద్ధాప్య నిరోధక ఔషధంతో కరోనాకు చెక్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడుతున్న వారిలో 65 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉన్నారు. ఇతరులతో పోలిస్తే ఇన్ఫెక్షన్తో వారు మరణించేందుకు 23 రెట్లు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి వ్యాధి నిరోధక వ్యవస్థకు పునరుత్తేజం నింపే ఓ మార్గాన్ని హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించారు. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వని ఎన్ఏడీ (నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్) బూస్టర్ ఔషధాలను 65 ఏళ్లకు పైబడిన కరోనా రోగులకు ఇస్తే సత్ఫలితాలు ఉండొచ్చని తెలిపారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని జీవకణాల్లో ఎన్ఏడీ తగ్గుతూపోతుంది. ఫలితంగా జీవక్రియలు మందగించి, రోగ నిరోధక వ్యవస్థ డీలాపడుతుంది. కృత్రిమంగా ఔషధ రూపంలో అందించే ఎన్ఏడీ వ్యాధి నిరోధక వ్యవస్థను మరోసారి చైతన్యవంతం చేసి కరోనా ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు పురికొల్పుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.













